పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర – Potti Sreeramulu biography in Telugu

పొట్టి శ్రీరాములు భారతదేశానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు విప్లవకారుడు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన త్యాగానికి ఈయనను అమరజీవి అని పొగుడుతారు.

ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోసం 56 రోజుల నిరాహారదీక్ష చేసి తన తుది శ్వాసను విడిచారు.

బాల్యం :

పొట్టి శ్రీరాములు 16 మార్చి 1901 వ సంవత్సరం మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ అనే దంపతులకు జన్మించారు.

ఈయన హిందూ మతంలోని కోమటి కులానికి చెందిన వారు. తన స్కూల్ చదువును మద్రాస్ నుంచి పూర్తి చేసారు. ముంబై లోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి శానిటరీ ఇంజనీరింగ్ ను చదివారు.

తన చదువు పూర్తి చేసుకున్న తరవాత బాంబే లోని గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే లో చేరారు. 1929 వ సంవత్సరంలో శ్రీరాములు తన భార్య మరియు బిడ్డను కోల్పోయారు.

రెండు సంవత్సరాల తరవాత తన ఉద్యోగాన్ని వదిలేసి భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడటానికి గాంధీజీ యొక్క సబర్మతి ఆశ్రమం లో చేరారు.

స్వాతంత్ర ఉద్యమం:

శ్రీరాములు చురుకుగా స్వాతంత్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1930 వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు గాను అరెస్ట్ చేయబడ్డారు.

1941 నుంచి 1942 మధ్యలో తాను స్వయంగా కూడా స్వతంత్ర సత్యాగ్రహాలలో పాల్గొన్నారు అలాగే క్విట్ ఇండియా ఉద్యమం లో కూడా పాల్గొన్నారు. ఫలితంగా 3 సార్లు అరెస్ట్ చేయబడ్డారు.

గుజరాత్ లోని రాజ్‌కోట్‌ మరియు కృష్ణా జిల్లాలోని కొమరవోలు లో గ్రామ పునర్నిర్మాణ (village reconstruction) కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు అంకితభావం మరియు ఉపవాస సామర్థ్యం చూసి మహాత్మా గాంధీ చెబుతూ ” శ్రీరాములు లాంటి వారు 11 మంది అనుచరులు ఉంటే కేవలం ఒక్క సంవత్సరం లోనే బ్రిటిష్ రాజ్యం నుంచి స్వాతంత్రం తీసుకునేవాడిని” అని అన్నారు.

1933 నుంచి 1944 మధ్య నెల్లూరు జిల్లాలో చరఖా వినియోగం మరియు వ్యాప్తికి చాలా కృషి చేసారు.

కుల, మత భేదాలు లేకుండా అందరి ఇంట్లో భోజనం చేసేవారు. 1946 నుంచి 1948 వరకు దళితులకు మద్దతు తెలుపుతూ 3 సార్లు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

మొదటిసారి దళితులను పవిత్ర స్థలాలైన దేవాలయాల లోకి ప్రవేశం కల్పించాలని దీక్ష చేపట్టారు. రెండవ సారి వేణు గోపాల స్వామి ఆలయం లోకి ప్రవేశం కల్పించాలని దీక్ష చేసారు. మూడవ సారి కూడా దళితుల ఉద్దరణ కోసం దీక్ష చేసారు.

తన జీవితం చివరి దశలో నెల్లూరు లో నివసిస్తూ హరిజనోద్ధరణకు (దళితుల ఉద్దరణ) కోసం కృషి చేసారు.దీనికి సంబంధించిన నినాదాలను అట్టలపై రాసి మేడలో వేలాడతీసుకొని ప్రచారాం చేసారు.

ఆంధ్ర రాష్ట్రం:

ముందు మద్రాస్ ప్రెసిడెన్సీ లోనే ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేది. ఆంధ్ర ప్రజల యొక్క సంస్కృతిను కాపాడటానికి మరియు తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలుగు భాషా పరంగా మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రంను విడతీయాలని మరియు దానికి మద్రాస్ రాజధానిగా ఉండాలని ప్రభుత్వంపై వత్తిడి చేసారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తాను అన్న తరువాత దీక్ష విరమించుకున్నారు.

జవహర్ లాల్ నెహ్రు మాత్రం ఈ విషయం పై ఎలాంటి పురోగతి సాధించలేదు. దీని వెనక ఉన్న ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్రానికి మద్రాస్ రాజధానిగా అడగటం. JVP కమిటీ (జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య ) ఈ ప్రతిపాదనను ఒప్పుకోలేదు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో జరుగుతున్న జాప్యం ను చూసి 19 అక్టోబర్ 1952 లో మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద తన నిరాహార దీక్ష ను మళ్ళీ కొనసాగించారు.

నిరాహార దీక్ష చూసిన తరవాత కూడా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిరాహార దీక్ష చేస్తూ 15 డిసెంబర్ రాత్రి 1952 లో తన తుది శ్వాస విడిచారు.

పొట్టి శ్రీరాములు కంటే ముందు జతిన్ దాస్ మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ చనిపోయారు. మిగతా వారందరు తమ దీక్షను విరమించుకున్నారు లేదా బలవంతంగా ఆహారాన్ని తీసుకున్నారు.

శ్రీరాములు మరణం తరవాత తన త్యాగాన్ని పొగుడుతూ వేల మంది నిరసనలు తెలిపారు.

నిరసనలు కొద్ది సమయంలో అల్లర్లు గా మారాయి. ఫలితంగా చాలా ప్రజా ఆస్తి నష్టం జరిగింది. వార్త ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందటం వల్ల విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కనిగిరి మరియు నెల్లూరు ప్రాంతాలలో కూడా నిరసనలు మొదలయ్యాయి.

పోలీసుల కాల్పులలో అనకాపల్లి మరియు విజయవాడ కు చెందిన ఏడుగురు చనిపోయారు. నిరసనలు మూడు నాలుగు రోజులు జరగటంతో మద్రాస్ మరియు ఆంధ్ర ప్రాంతాలలో సాధారణ జీవితానికి చాలా భంగం కలిగింది.

19 డిసెంబర్ 1952లో ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు.

అక్టోబర్ 1 1953 లో తెలుగు మాట్లాడే ప్రజల కోసం కర్నూల్ రాజధాని తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

హైదరాబాద్ రాష్ట్రంలో కూడా తెలుగు మాట్లాడే జిల్లాలు కూడా ఆంధ్ర రాష్ట్రం లో కలిపారు. హైదరాబాద్ జిల్లాలనే తెలంగాణ అని అంటారు. ఆంధ్ర రాష్ట్రం తరవాత ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది.

1 నవంబర్1956లో హైద్రాబాద్ ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధానిగా ప్రకటించారు.

Source: Potti Sreeramulu – Wikipedia

Leave a Comment