సమ్మక్క సారక్క జాతర అంటే ఏమిటి – What is Sammakka Sarakka Jatara in Telugu

మేడారం జాతరను సమ్మక్క సారక్క జాతర లేదా సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా అంటారు. ఈ పండగ లేదా జాతర ను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఈ జాతర ద్వారా గిరిజన దేవతలను కొనియాడుతారు. 

ఈ జాతరలో ప్రజలు దేవతలకు బెల్లాన్ని సమర్పించుకుంటారు, దీనినే ప్రజలు బంగారం అని కూడా అంటారు. 

ఈ జాతర ములుగు జిల్లా నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామం వద్ద జరుగుతుంది. 

ఈ జాతరలో ఆచారాలు కోయ తెగ పూజారులచే, కోయ ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి.  

1955 వ సంవత్సరం వరకు మేడారం జాతరకు కేవలం 2000 మంది హాజరు అయ్యేవారు. ఇందులో 75 శాతం కోయలు మాత్రమే ఉండేవారు. 

ప్రస్తుతం కోటి కి పైగా భక్తులు మేడారం జాతరకు వెళ్తున్నారు అయితే ఇందులో కేవలం 2 శాతం మాత్రమే కోయ ప్రజలు ఉన్నారు.మిగతా భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. 

ఈ జాతర జరిగే ప్రాంతం దక్షిణ భారతదేశం లోని అతిపెద్ద అటవీ ప్రాంతం అయిన దండకారణ్యము యొక్క భాగం. ఉత్తర ప్రదేశ్ లో జరిగే కుంభ మేళ తరవాత సమ్మక్క సారక్క జాతరకు ఎక్కువ మొత్తంలో భక్తులు వస్తారని అంచనా.   

సమ్మక్క సారక్క చరిత్ర:  

జగిత్యాల ప్రాంతం లోని  పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప కనిపించింది. ఈ పాప చుట్టూ పులులు సింహాలు కాపలాగా ఉండటం చూసి వన దేవతగా భావించారు.  ఈ పాపకు  సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు.

 కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన వనదేవతగా ఆమెను కొనియాడేవారు. సమ్మక్క చేతి తో ఇచ్చిన ఆకుపసరు ఎలాంటి రోగమైనా నయం చేసేది. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని బలపరిచేది. 

మేడరాజు సమ్మక్కను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్ళి చేసాడు.  ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.  

పగిడిద్దరాజు కాకతీయ ప్రభువుల వద్ద సామంత రాజుగా ఉండేవాడు. ఆ సమయంలో ఉన్న కరువు కారణంగా కప్పం కట్టకపోవటం తో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు మేడారం పై దండెత్తాడు. సమ్మక్క, సారక్క, జంపన్న మరియు నాగులమ్మ వేరు వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు.   

 కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధంలో మరణిస్తారు.  ఓడిపోయాం అనే వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు.  అప్పటి నుంచి సంపెంగ వాగు పేరు జంపన్న వాగు గా ప్రసిద్ధి చెందింది.  

యుద్ధం ముగిసిన తరవాత సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమిని నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. 

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు సమ్మక్క జాడ కనిపించలేదు. అదే ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర ర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. 

దానినే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

సమ్మక్క సారక్క జాతర 4 రోజులు జరుగుతుంది. 

మొదటి రోజు : మాఘ శుద్ధ పొర్నమి (బుధవారం) 

కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారక్క విగ్రహాన్ని తీసుకువస్తారు. పగిడిద్ద రాజు విగ్రహాన్ని పూనుగొండ్ల నుంచి మేడారం వరకు తీసుకువస్తారు. 

రెండవ రోజు (గురువారం): 

రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.  

మూడవ రోజు (శుక్ర వారం ) :

ఈ రోజున సమ్మక్క మరియు సారక్క భర్తలు పగిడిద్ద రాజు మరియు గోవింద రాజులను పూజిస్తారు. భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క, సారక్కలకు నైవేద్యంగా సమర్పించే ముందు బెల్లంతో తూకం వేస్తారు. 

నాలుగవ రోజు:

ఈ రోజును  “తల్లుల వనప్రవేశం” అని కూడా అంటారు. కుంకుమ భరిణెను తిరిగి చిలకలగుట్టకు తీసుకువెళ్లి మళ్ళీ వచ్చే జాతర వరకు అక్కడే ఉంచుతారు. 

 ఈ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. 

భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. 

Reference: Sammakka Saralamma Jatara – Wikipedia

Leave a Comment